సంక్రాంతి సమరానికి సై అంటున్న సునీల్
గత కొద్దిరోజులుగా సంక్రాంతి బరి నుంచి సునీల్ పూలరంగడు తప్పుకుందనే వార్తలొచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని.. ముందు చెప్పిన ప్రకారమే.. సంక్రాంతి కానుకగా పూలరంగడు విడుదల చేస్తున్నామని నిర్మాతలు డేట్ కూడా ప్రకటించారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే.. మహేష్, వెంకీ లాంటి స్టార్స్ తో సునీల్ సమరానికి సై అంటున్నట్టే.
ప్రేమకావాలి ఫేం ఇషా చావ్లా ఇందులో హీరోయిన్ గా నటి్స్తోంది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై... అహా నా పెళ్లంట డైరెక్టర్ వీరభద్రం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూలరంగడు చిత్రంలో మూడు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. మిగిలిన మూడు పాటల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు స్పీడందుకున్నాయి. జనవరి మొదటి వారంలో ఈ చిత్ర ఆడియోను రిలీజ్ చేసి జనవరి 14న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. సునీల్ కెరీర్ లోనే అత్యధికంగా 450 థియేటర్లలో ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నారు.

